Skip to main content

The Plans of Satan

ఒకరోజు సాతాను ఒక ఇంట్లో.. తెల్లని గోడ మీద తేనె చుక్క ఒకటి వేలితో అంటించి పక్కకి
వెళ్ళిపోయి, జరిగబోయే వేడుక చూడాలని ఆరాటంగా ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈలోగా అటుగా చీమ ఒకటి వచ్చి, తేనె చుక్కని చూసి, తేనెను తినడం మొదలెట్టింది. ఇది గమనించిన గోడ మీది
బల్లి ఒకటి ఆ చీమని తినడానికి వచ్చింది.బల్లి కోసం ఎలుక వచ్చింది. ఎలుకను చూసి,దాన్ని
 ఎలాగైనా పట్టి, చంపి తినెయ్యాలని  ఆ ఇంట్లోకి పిల్లి కూడా వచ్చేసింది. పిల్లిని ఎలుక  ఇల్లంతా  కలియ పరుగెత్తించ మొదలెట్టింది. ఈలోగా పక్కింటి కుక్క, ఇదంతా  చూసేసింది.  భలే ఛాన్స్  దొరికిందనుకుని  ఉన్న పాటున ఈ ఇంట్లోకి పరుగులెత్తింది.  కుక్కని చూసిన పిల్లి  గుండెలు  అదిరిపడ్డాయి.  ఎలకని వదిలి ప్రాణాలు కాపాడుకోవటం కోసం పిల్లి పరుగులంకించుకుంది.
 ఇలా కుక్క, పిల్లి ఒకదాని వెనక ఒకటి పరుగెత్తి పరుగెత్తీ కాసేపటికే ఇల్లంతా గందరగోళం చేసేసి, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ పగులగొట్టేస్తూ  ఉన్నాయ్.

దీంతో ఇల్లంతా పెద్దగా శబ్దాలు మారుమోగిపోతూ ఉంటే, ఉన్న పాటున నిద్రలేచి వచ్చి చూసిన ఇంటి యజమానికి, కోపం కట్టలు తెంచుకుని వచ్చేసింది.
అతన్ని చూసేసిన పిల్లి, మెల్లగా గోడ దూకి పారిపోయింది. కుక్క తప్పించుకునేందుకు వేరొక మార్గం లేకపోవడం వల్ల దొరికిపోయింది. బెల్ట్ తీసి దాన్ని
అదే పనిగా చితకబాదుతూ ఉంటే,దాని అరుపులకి ఆ పక్కింట్లో ఉన్న దాని యజమాని పరుగున వచ్చి, "నా కుక్కని ఎందుకలా చితక బాదుతున్నావ్.." అని అడిగాడు. వాగ్వాదం మొదలై చివరకి ఒకడి కాలర్ ఒకడు పట్టుకుని కొట్టుకోవటం మొదలెట్టారు.
గొడవ కాస్తా పాకం ముదరటం వల్ల వీళ్ళ ఇంటి వాళ్ళు, వాళ్ళింటి వాళ్ళు, వీళ్ళ బంధువులు, వాళ్ల బంధువులు... ఇలా వాళ్ళంతా రెండు వర్గాలుగా
 ఏర్పడి పోయి కొట్టేసుకుంటూ ఉన్నారు. విషయం కాస్తా పోలీసుస్టేషన్ దాకా వెళ్ళిపోయింది. ఎలాగైతేనో చివరకి, గొడవ సద్దుమనగడం వల్ల రాజీకి వచ్చి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదంతా చూస్తున్న సాతాను చంకలు కొట్టుకుంటూ పడి దొర్లీ దొర్లీ నవ్వేసుకుని, ఆనందించాడు. అంతా అయిపోయాక అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

జరిగిందంతా చూసిన ప్రభువు, ఒకవేళ సాతాన్ని పిలిచి ఇలా "ఏమీ తెలీని నా బిడ్డల్ని ఎందుకిలా మోసం చేసి, ఇంతగా బాధిస్తున్నావ్ ? నీకిది న్యాయమా ? "
 అని ప్రశ్నిస్తే, వాడి సమాధానం ఇలా ఉండచ్చు. " బానే ఉంది. నీ కంటికి నేనే కనపడుతున్నానా ? నేనేం చేసాను. నువ్వెప్పుడూ ఇంతే. వాళ్ళు వాళ్ళూ కొట్టుకుని చస్తే నువ్వేమో నన్ను ప్రశ్నిస్తున్నావ్. నేరం నాది అంటావేంటి. నేనేదో సరదాకి, నాకెప్పటి నుండో గోడ మీద తేనే చుక్క రాయాలనే కోరిక తీర్చుకోవాలని అలా రాసాను. నా తేనే చుక్క. నా గోడ. నా ఇష్టం. నేనేమైన చీమని రమ్మన్ననా ? బల్లిని రమ్మన్నానా ? ఎలకని, పిల్లిని, కుక్కని.. రమ్మన్నానా? వచ్చి కొట్టుకోమని చెప్పనా ? వాళ్ళు వాళ్ళు తిన్నది అరక్క కొట్టుకుంటే మధ్యలో నన్ను నిలదీస్తావేంటి ? ఇలా మరో సరి, వాళ్ళు చేసిన నేరాలు నా మీద వేసి, నన్ను పిలిచి విచారణ చేయకు" అని సింపుల్ గా వెళ్లిపోతాడేమో.
  ఒక చిన్న తేనె చుక్క గోడ మీద అంటించడం వల్ల, ఇంత రాద్దాంతం జరిగిందంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదూ. నిజమే, ఇదంతా చేసి, వెనకుండి, జరుగుతున్న వేడుక చూస్తున్న సాతానుకి మంచి కామెడి మూవీ చూసినంత ఆనందంగా ఉంటుంది. కానీ, ఇది సాతాను చేసిన పని అని తెలుసుకోక, వలయంలో చిక్కుకుని విలవిలలాడుతున్న వారందరికీ మాత్రం చివరకు జీవితంలో చాలా చేదు అనుభవాలే మిగులుతాయి.

నిజానికి వాడు మన జీవితాల్లో ఇలానే చిన్న చిన్న విషయాలతోనే ముడిపెట్టి, ఉచ్చులోకి లాగి పాపాలతో సులువుగా చిక్కులు పెట్టేసి ఆనందిస్తూ ఉంటాడు. అది తెల్సుకోలేక మన జీవితాన్ని మనమే చేజేతులా నరకం చేసేసుకుంటూ ఉంటాం. మనకి పాములవలే వివేకం ఉండాలి. శత్రువు పన్నాగాలని, కుయుక్తులనీ గమనించుకోగల యుక్తి, ఎదిరించగల శక్తీ మనలో ఉండాలి. లేకుంటే జీవితంలో ఇలా జ్ఞానం లేక చెరపట్టబడి, అనేకులు శ్రమలను అనుభవిస్తూనే ఉంటాం. దెబ్బలు తింటూనే ఉంటాం. కాబట్టి ఈ దుర్ధినాలలో మనకి దైవ జ్ఞానం, వివేకం ఎంతైనా అవసరం.

  


Comments

Popular posts from this blog

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను . ఎప్పుడైనా ఎవరైనా తమ పాపక్షమాపణ నిమిత్తము సర్వలోక రక్షకుడైన యేసుని వెతుకుతుంటే.... వారు తెలుసుకోవలసిన విషయము ఏమిటంటే; యేసు కూడా వారి కోసము వెతుకుతున్నారు అని. చూడండి.... జక్కయ్య అనే వ్యక్తి ఉన్నారు.... ఈ జక్కయ్య యేసు కోసము వెతుకుచున్నారు; కానీ ఈ జక్కయ్యకి కూడా తెలియని విషయము ఏమిటంటే....? యేసు కూడా ఈ జక్కయ్య కోసమే వెతుకుతున్నారు. . . . అందుకే తన ముందు గుంపులు గుంపులుగా జనం ఉన్నా యేసు జక్కయ్య దగ్గరికి వచ్చి ఆగారు. అంతకుముందు యేసుని జక్కయ్య చూడలేదు.... వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవలేదు.... కానీ; యేసయ్యకు తెలుసు యెరికొలో మరోక ఆత్మ రక్షణ కోసం ఎదురుచూస్తుందని.... యేసయ్యకు తెలుసు అతను జనముచేత పాపిగా పిలువబడే సుంకపుగుత్తదారుడని.... యేసుక్రీస్తు వారికి తెలుసు అతను పొట్టివాడని; అందుకే చెట్టు ఎక్కాడని, అతని పేరు జక్కయ్య అని. . . . అందుకే వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవకపోయినా యేసయ్య అతనిని పేరు పెట్టి పిలిచారు. జక్కయ్య కోసము వెతుకుతూ అతను దాగివున్న చోట ఆగి మరీ పట్టుకున్నారు. అక్కడి ప్రజలు జక్కయ్య గురించి ఏమి అనుకుంటున...

Calvary