Skip to main content

విశ్వాసం అంటే?

బ్లాండిన్ అనే వ్యక్తి నయాగర జలపాతం మీద తాడుపై నడుస్తున్న సందర్భమది. ఆయన నడచుకుంటూ వస్తుంటే ప్రజలంతా జేజేలు పలికారు.
బ్లాండిన్ అంటున్నాడు నేను తిరిగి అవతలకు వెళ్లి పోగలను నమ్ముతున్నారా? అంతా అవును! నీవు వెళ్లి పోగలవు అంటున్నారు. బ్లాండిన్ మరళా అంటున్నాడు నా భుజాల మీద ఒకరిని ఉంచుకొని వెళ్లి పోగలను నమ్ముతున్నారా? ప్రజలంతా ... అవును! మేము నమ్ముతున్నాం! అయితే, మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి. అంతా నిశ్శబ్దం!!! ఎవ్వరూ ముందుకు రావట్లే. కారణం? చూచిన దానిని నమ్మగలిగారు. అది వారి జీవితంలో జరుగుతుందని విశ్వసించ లేకపోయారు.

విశ్వాసం అంటే?
• చీకటిలోనికి దూకడం కాదు.
• గాలిలో మేడలు కట్టడం కాదు.
• దేవుని వాక్కులోని బలమైన రుజువులపై అది నిలిచి వుంది.
• నిజమైన విశ్వాసం దేవునిని గురించి మనుష్యులు చెప్పే ప్రతీ మాటను నమ్మదు.
• దేవుడు వెల్లడించాడు అని మనుష్యులు అనుకునే ప్రతీదానినీ స్వీకరించదు.
• పరిశుద్ధ గ్రంధంలో వెల్లడి అయిన సత్యాన్నే అది నమ్ముతుంది.

విశ్వాసం అంటే?
పూర్తిగా ఆధారపడడం!

నమ్మిక, విశ్వాసం ఒక్కటి కాదు.
నమ్మడం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం.
నమ్మిక అనేది విశ్వాసంలోనికి నడిపించాలి. విశ్వాసము రెండు విషయాలకు సంబంధించినది.
1. దేనికొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో? దానిని ఒక దినాన్న చూస్తాను అనే నమ్మకము.
2. కంటికి కనిపించనిది ఒకదినాన్న ప్రత్యక్ష మవుతుంది అనే నమ్మకం.

విశ్వాసము అంటే?
నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువు. హెబ్రీ 11:1

దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసాడని నమ్ముతాము.
కాని, మన జీవితంలో ఎదురుపడే ఎర్ర సముద్రమువంటి ఆటంకాలను దేవుడు చీల్చి, దానిగుండా మన గమ్యానికి నడిపించగలడని విశ్వసించ లేకపోతున్నాం. కారణం? సమస్యను చూచి భయపడుతున్నాము తప్ప, ఆ సమస్యను పరిష్కరించగలిగే దేవునిపైన ఆధారపడలేక పోతున్నాం! ఆయన శక్తిని అర్ధం చేసుకోలేక పోతున్నాం అవిశ్వాసులుగానే ఉంటూ,  ఆశీర్వాధాలు జార విడుస్తున్నాం!

అబ్రాహాము విశ్వాసము:

అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను. హెబ్రీ 11:8

అబ్రాహాము పేరు అప్పటికి 'అబ్రాము'. అతని తండ్రి పేరు తెరహు. తండ్రి విగ్రహాలను తయారు చేస్తుంటే? అబ్రాహాము వాటిని అమ్మేవాడు. అట్లా వారి జీవనం సాగుతుండేది. ఒకరోజు దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై నేను చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నిన్ను ఆశీర్వధిస్తాను అని చెప్పాడు.

విగ్రహాలు అమ్ముకునే అబ్రాహాముకు ప్రత్యక్షమైన ఆదేవుడెవరో? తెలియదు. ఎక్కడకి వెళ్ళమంటున్నాడో? తెలియదు.
అబ్రాహాముకు దేవుడు అడ్రస్ చెప్పలేదు. చెప్పివుంటే? ఆ ప్రాంత పరిస్థితులు తెలుసుకోవడానికి అవకాశం వుండేది. బయలుదేరమన్నాడు తప్ప, ఎక్కడకి వెళ్ళాలో చెప్పలేదు.

మనమయితే  దేవునిని ఎన్ని ప్రశ్నలు అడిగేవాళ్ళమో?
కాని, అబ్రాహాము మారు మాట్లాడలేదు.
ఆయన దేవుడో? కాదో? పరీక్షించే ప్రయత్నమూ చెయ్యలేదు. దేవుని పిలుపుకు లోబడి బయలుదేరాడు.
దారిలో అంతా అడుగుతున్నారు.
అబ్రాహాము ఎక్కడకి వెళ్తున్నావు?
ఎక్కడకి వెళ్తున్నాడో తనకి తెలిస్తేకదా చెప్పడానికి?
దానికి అబ్రాహాము సమాధానం 'ఏమో?'

ఎక్కడకి వెళ్తున్నాడో తెలియని వాడిని పిచ్చోడు అంటాము.
ఇప్పుడు అబ్రాహాము విశ్వాసము అతనిని పిచ్చోడిని చేసింది. అయినా, అతని ప్రయాణం ఆగలేదు. ఆ దినాన్న ప్రారంభమయిన ఆయన విశ్వాస ప్రయాణం అతనిని ఎంత ఎత్తుకు చేర్చింది అంటే? భూమియొక్క సమస్త వంశములు ఆయనయందు ఆశీర్వధించబడ్డాయి.

• మీ తండ్రి ఎవరని యూదులను అడిగితే వారు చెప్పే సమాధానం 'అబ్రాహాము'
• మీ తండ్రి ఎవరని ముస్లింలను అడిగితే వారు చెప్పే సమాధానం 'అబ్రాహాము'
• మీ తండ్రి ఎవరని క్రైస్తవులను అడిగితే వారు చెప్పే సమాధానం 'అబ్రాహాము'

అంతేకాదు ఆయన వంశములో నుండి వచ్చిన యేసు ప్రభువు వారి ద్వారా మిగిలిన వంశములన్నియూ ఆశీర్వధించబడ్డాయి. దీనికంతటికీ కారణము? అబ్రాహాము విశ్వాసమే.
అతని విశ్వాసము అతనిని 'విశ్వాసులకు తండ్రి'గా చేసింది.

నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.
                 రోమా  4:18

'అబ్రాహాము' అనుమాటకు
'అనేక జనములకు తండ్రి' అని అర్ధం. అనేక జనములకు తండ్రి కావాలంటే? కనీసం ఒక్క కుమారుడైనా వుండాలి కదా? లేడే? (ఇష్మాయేలు వాగ్ధాన పుత్రుడు కాదు). అప్పటికే అబ్రాహాముకు నూరేళ్ళు, శారమ్మకు తొంబై ఏళ్ళు. ఆయనొక ముసలోడు, ఈమె ఒక ముసలమ్మ.

సృష్టి ధర్మము ప్రకారముగా వారి శరీరధర్మం నిలిచిపోయింది. శరీరం మృతతుల్య మయ్యింది.
ఇక బిడ్డలకోసం నిరిక్షించడానికి వారికున్న ఆధారమేదీలేదు.
అయితే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.

కారణం?
•సృష్టికర్తే తన దేవుడైనప్పుడు, ఇక సృష్టి ధర్మంతో పనేముంది?
•వడ్డించే వాడు మనవాడయినప్పుడు ఎక్కడ కూర్చుంటే ఏమయ్యింది?

మాట ఇచ్చిన దేవుడు శక్తి మంతుడు, సమర్ధుడు అని విశ్వసించ గలిగాడు అబ్రాహాము. . ఆయనపైనే పూర్తిగా ఆధారపడగలిగాడు. దేవుడు తనకిచ్చిన వాగ్దానంతప్ప మరే ఇతర అననుకూల పరిస్థితులు ఆయన కళ్ళముందు కదలాడట్లేదు.

నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆ నిరీక్షణ అతనిని సిగ్గు పరచలేదు.

అన్ని పరిస్థితులూ నీకు అనుకూలముగా వుండి, అన్నీ నీవు అనుకున్నట్లే జరిగితే అది'సహజం'. అద్భుతమేమి కాదు. కాని, అన్ని దారులూ మూసుకుపోయి ఇక ఏ అవకాశమూ లేని పరిస్థితులలో నీవు ఆశించినదానికంటే అత్యధిక మేలులతో నీ జీవితం నింపబడితే? అది  'అధ్బుతం'.

దేవుడు అద్భుతమే నీ జీవితంలో చెయ్యాలని ఎదురు చూస్తున్నాడు.
కాని, అట్లాంటి పరిస్థితులు నీవు కల్పించడం లేదేమో? ఆయనపై ఇంకా పూర్తిగా ఆధారపడలేక పోతున్నావేమో?
నీవున్న పరిస్థితులు ఆయన శక్తిని, సామర్ధ్యమును గుర్తించకుండా అడ్డగిస్తున్నాయేమో?

నీవు విశ్వసించ గలిగితే?
ఆయనకు అసాధ్యమంటూ ఏది లేదు. సమస్తమూ సాధ్యమే.
•రాళ్ళ వలన పిల్లలను పుట్టించగలడు.
•కాకులతో సహితం నిన్ను పోషించగలడు.
•బండను చీల్చి నీ దాహాన్ని తీర్చగలడు.
ఆయన యందు నమ్మిక మాత్రం వుంచు. అదెన్నటికీ నిన్ను సిగ్గు పరచదు.

అప్పుడాయననీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను. ఆది  22:2

పరిశుద్ధ గ్రంధములో దేవుడు ఒక మనిషిని బలిగా కోరిన సందర్భం ఇదొక్కటే. దేవునిని గురించి తెలియని వాళ్ళు ఇది చదివితే? క్రైస్తవులు ఆరాధించే దేవుడు ఇట్లాంటి వాడా? అనుకుంటారు.
ఆయన బలిని కోరేవాడు కానేకాదు. బలి ఆయనకు ఇష్టమైతే అబ్రాహామును అడ్డగించే వాడుకాదు.

వృద్ధాప్యమందు నేనిచ్చిన కుమారునికి ప్రాధాన్యత ఇస్తాడా? ఆ కుమారుని ఇచ్చిన నాకు ప్రాధాన్యత ఇస్తాడా? అని అబ్రాహాము విశ్వాసానికి దేవుడు పెట్టిన పరీక్ష మాత్రమే. దేవుడు అడుగుతున్నాడు.
'నీవు ప్రేమించు ఇస్సాకును దహనబలిగా నర్పించు'

దహన బలి అంటే?
నరికి, బూడిదగా చెయ్యడం.
ఎవరిని? కన్న కొడుకుని  (తాను ప్రేమించే కొడుకుని). అబ్రాహాము ఒక్క మాటకూడా మాట్లాడలేదు. విధేయత ప్రశ్నించదు.

ఇంతటి విశ్వాసమునకు కారణమేమిటి? ఒక్కటే! దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే? ఇస్సాకు తప్పక బ్రతికివుండి తీరాలి. అందుచే దేవుడు ఇస్సాకును చంపడు. చంపినా తిరిగి బ్రతికించగలడు.

దహన బలికి సర్వం సిద్ధం చేసుకున్నాడు. చివరి చూపుగా నీ కొడుకుని చూచుకో అనే చిన్న మాట కూడా శారాతో  చెప్పలేదు.
పనివారిని తీసుకొని మోరియా పర్వతానికి వెళ్ళాడు. దహన బలి అర్పించే స్థలానికి కాస్త దూరంలో పనివారితో అంటున్న మాట. మీరు ఇక్కడే వుండండి 'మేము' దహనబలి అర్పించి "తిరిగి వస్తాము". అదేంటి? వస్తాము అంటున్నాడు? వస్తాను అనాలి కదా? బైబిల్ లో ప్రింట్ తప్పు పడిందా? కాదు! ఆయన మాటల్లోని విశ్వాసము మనకు అంతుపట్టదు. కనీసం మన ఊహలకు కూడా అందదు.

కట్టెల మోపు ఇస్సాకు మీద ఉంచాడు. అంటే? కట్టెల మోపు ఎత్తుకొని ఇస్సాకు మోరియా పర్వతం ఎక్కుతున్నాడంటే? అతడు చిన్నపిల్లాడు కాదు. ఇస్సాకు అడుగుతున్నాడు.  డాడీ! దహనబలికి కట్టెలు, నిప్పు వున్నాయిగాని, గొర్రెపిల్ల ఏది? ఆ ప్రశ్నకు అబ్రాహాము గుండె ఆగిపోవాలి.

కాని, అబ్రాహాము అంటున్నాడు. "దేవుడే చూచుకుంటాడు"
అబ్బా! అబ్రాహాము విశ్వాసం చూస్తుంటే? శరీరం జలదరిస్తుంది కదా?  అబ్రాహాము బలిపీఠము కట్టాడు. కట్టెలు పేర్చాడు, ఇస్సాకును బంధించి దాని మీద వుంచి, కత్తి పైకెత్తాడు. కొద్ది క్షణాల్లో ఆ కత్తి ఇస్సాకు మెడను రెండుగా చీల్చబోతుంది.

కత్తి పైకెత్తే వరకు అబ్రాహామును పరీక్షించాడు గాని, ఆ కత్తి ఇస్సాకు మీదికి దిగనియ్యలేదు. అబ్రాహాము చెప్పినట్లే దహనబలికి బలిపశువును దేవుడే చూచుకున్నాడు. విశ్వాసవీరుడు విజయం సాధించాడు. మరిన్ని వాగ్దానాలు స్వతంత్రించు కున్నాడు.

మనమునూ విశ్వసిద్దాం!
విజయం సాధిద్దాం!

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్ జీసస్.

Comments

Popular posts from this blog

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను . ఎప్పుడైనా ఎవరైనా తమ పాపక్షమాపణ నిమిత్తము సర్వలోక రక్షకుడైన యేసుని వెతుకుతుంటే.... వారు తెలుసుకోవలసిన విషయము ఏమిటంటే; యేసు కూడా వారి కోసము వెతుకుతున్నారు అని. చూడండి.... జక్కయ్య అనే వ్యక్తి ఉన్నారు.... ఈ జక్కయ్య యేసు కోసము వెతుకుచున్నారు; కానీ ఈ జక్కయ్యకి కూడా తెలియని విషయము ఏమిటంటే....? యేసు కూడా ఈ జక్కయ్య కోసమే వెతుకుతున్నారు. . . . అందుకే తన ముందు గుంపులు గుంపులుగా జనం ఉన్నా యేసు జక్కయ్య దగ్గరికి వచ్చి ఆగారు. అంతకుముందు యేసుని జక్కయ్య చూడలేదు.... వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవలేదు.... కానీ; యేసయ్యకు తెలుసు యెరికొలో మరోక ఆత్మ రక్షణ కోసం ఎదురుచూస్తుందని.... యేసయ్యకు తెలుసు అతను జనముచేత పాపిగా పిలువబడే సుంకపుగుత్తదారుడని.... యేసుక్రీస్తు వారికి తెలుసు అతను పొట్టివాడని; అందుకే చెట్టు ఎక్కాడని, అతని పేరు జక్కయ్య అని. . . . అందుకే వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవకపోయినా యేసయ్య అతనిని పేరు పెట్టి పిలిచారు. జక్కయ్య కోసము వెతుకుతూ అతను దాగివున్న చోట ఆగి మరీ పట్టుకున్నారు. అక్కడి ప్రజలు జక్కయ్య గురించి ఏమి అనుకుంటున...

Calvary